జగన్ చేస్తున్న పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనతో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. ప్రజలకు మద్దతుగా…. కార్యకర్తలకు భరోసాగా నేతల పోరాటాలు చేయాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, క్షేత్ర స్థాయిలో పని చేయని నేతలను ఉపేక్షించేది లేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఇంచార్జిలతో సోమవారం జూమ్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం నేతలో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలకు న్యాయం జరిగేలా, మద్దతిచ్చేలా పోరాటం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజాసమస్యలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, త్వరలో చేపట్టబోయే పార్టీ సభ్యత్వ నమోదు, నేతల పనితీరు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇంట్లో తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని సిఎం.. ఇక రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారనే చర్చ రాష్ట్రం అంతా ఉందని అన్నారు. జగన్ రెడ్డి తన అసమర్ధ, స్వార్ధపూరిత విధానాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దెబ్బతీశారని పేర్కొన్నారు.
తెలుగు దేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ 100వ జయంతి, మహానాడు నిర్వహణపై పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలో మొదలవుతుందని… ఆన్ లైన్ ద్వారా సభ్యత్వం పొందే విధంగా ప్రణాళిక సిద్దం చేసినట్లు నేతలకు తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చెయ్యాలని సూచించారు. పార్టీ గ్రామ, మండల స్థాయిలో పెండింగ్ లో ఉన్న కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చెయ్యాలని సూచించారు. సమావేశంలో పార్టీ నేతలు గౌతమ్ రెడ్డికి సంతాపాన్ని తెలిపారు.