Site icon 123Nellore

దుమ్మరేపిన సూర్య.. ‘ఈటి’ టీజర్‌ అదుర్స్‌

suriya etharkkum thunindhavan movie teaser

కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. తెలుగులో ఒక్క స్ట్రయిట్‌ సినిమా చేయకపోయిన సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. వరుసగా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ హిట్టు మీద హిట్టు కొడుతున్నాడు సూర్య. ‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్‌’ చిత్రాలతో ఓటీటీ వేదికగా వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ‘ఈటి’తో వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాను మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. సూర్య నుంచి ఆశించే అన్ని రకాల మాస్‌ అంశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ‘నాతో ఉన్న వాళ్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’ అంటూ సూర్య చెబుతున్న సంభాషణలు అలరిస్తున్నాయి. మొత్తం యాక్షన్ సన్నివేశాలతో టీజర్‌ను నింపేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సూర్య మాస్ అవతార్‌ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు.

‘ఈటి’ సినిమాలో సూర్యకు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది. వినయ్‌రామ్‌, సత్యరాజ్‌, జయప్రకాశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమ్మాన్‌ స్వరాలందిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మరో విశేషం ఏటంటే.. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు వెర్షన్‌కి సూర్య స్వయంగా తన డబ్బింగ్‌ని తానే చెప్పుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నందున దానికి తగ్గట్లుగా సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు.

 

Exit mobile version