బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడీ’. ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయ్ జీవితచరిత్ర ఆధారంగా దీన్ని రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా కోసం హిందీ సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తుండటంతో ఇటు సౌత్ ఆడియెన్స్ కూడా అలియా ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 25న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మేకర్స్‌పై, నటి అలియాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
గంగూబాయి కుమారుడు, ఆమె మనవరాలు ఇప్పటికే ఈ సినిమాపై కోర్టులో కేసు పెట్టారు. తన తల్లి సెక్స్ వర్కర్ కాదని.. స్త్రీల అభివృద్ధి కోసం కృషి చేసిన ఆమెని తప్పుగా చూపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ సినిమా తీయడానికి తమ పర్మిషన్ కూడా తీసుకోలేదని వాపోయారు. ఈ సినిమాపై స్టే ఇవ్వమని కోరగా.. కోర్టు ఆ పిటిషన్‌ని కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు అతడితో పాటు కామాఠిపుర ప్రజలు కూడా ఈ సినిమాపై తిరగబడుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత కామాఠిపుర ప్రతిష్ట దెబ్బతిందని, ఆ ప్రాంతం మొత్తాన్ని రెడ్ లైట్ ఏరియాగా భావిస్తున్నారని.. ఇది తమకు పెద్ద అవమానమని సుమారు యాభై మంది స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా కలిసి కేసు రిజిస్టర్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్‌తో పాటు పలు సామాజిక సేవా సంస్థలు కూడా ఈ సినిమాకి వ్యతిరేకంగా కేసులు పెట్టారు.
ఈ కేసులన్నింటిపై స్పందించిన సుప్రీం కోర్టు ‘గంగూబాయి కతియావాడి’ సినిమా టైటిల్ మార్చమని దర్శకనిర్మాతలకు సూచించింది. ఇక మళ్లీ రేపు కోర్టులో వాదనలు జరగనున్నాయి. సినిమా రిలీజ్ కి మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో మేకర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.