ఏపీలో ఉన్నంత కడుపు మంట రాజకీయాలు దేశంలో మరెక్కడా లేవని వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ నేను సీఎం, అంటే నేను సీఎం అని కొట్టుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఒకపక్క త్యాగం అంటాడు, మరోపక్క లీడ్ చేస్తానంటాడని ఎద్దేవా చేశారు. వీళ్లకు ప్రజలంటే లెక్క లేని తనంగా ఉందని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని, చంద్రబాబు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోందని అన్నారు. చంద్రబాబును పవన్ సీఎం చేస్తాడా..పవన్ ను చంద్రబాబు సీఎం చేస్తాడా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టే ఒత్తిడి మేరకు రాజశేఖర్ రెడ్డి పొత్తులు పెట్టుకున్నారని వివరించారు. కానీ జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి స్పష్టంగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పొత్తులు ఉండవని అనడం లేదని, ఎన్నికలప్పుడు ఒకదాని కలిసి, తర్వాత విడిపోవడం ఎప్పటికే తప్పేనన్నారు. టీడీపీ జనసేనకు ఉన్న భావ స్వరూప్యత ఎంటని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలుస్తాయని బహిరంగంగా ఎందుకు ప్రకటించలేకపోతున్నాయని అన్నారు.
చంద్రబాబు, పవన్ బంధం కొనసాగుతూనే ఉంటుందని, ఎన్నికలకు ఇంకా రెండేళ్లు టైమ్ ఉందని, ప్రజల్లో చర్చ కోసమే పొత్తులు అంటూ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వ్యతిరేక ఓటు చీలకూడదని, పవన్ ఒంటరిగా పోటీ చేశాడని వీళ్లకు రాజకీయ అవసరాలే తప్ప ప్రజాప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిధ్దమవుతోందని, ఎల్లుండి నుంచి గడప గడపకు కార్యక్రమము ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు…