సాధారణంగా సినిమా హీరోలకున్న క్రేజ్‌ను వాణిజ్య సంస్థలు ఏదో రకంగా వాడుకోవాలని చూస్తుంటాయి. కంపెనీలు తమ బ్రాండ్లను హీరోలతో ప్రమోట్ చేయించుకునేందుకు భారీ ప్రకటనలు రూపొందిస్తుంటాయి. కోట్లు పెట్టి మరీ యాడ్ ఫిల్మ్స్ చేయిస్తుంటాయి. ఇక తమ అభిమాన కథానాయకుడిని అనుకరిస్తూ, అనుసరించేవారు ఎందరో. ఈ క్రమంలోనే అభిమానులను దృష్టిలో పెట్టుకుని హీరోలు సినిమాలు, ప్రకటనలు చేస్తున్నారు. స్టార్ హీరోల విషయానికొస్తే యాడ్ ఫిలిమ్స్‌లో నటించేందుకు తీసుకునే రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోతుంటుంది. అయితే కొందరు మాత్రం తాము ప్రమోట్ చేస్తున్న ప్రొడక్టు ఎలాంటిది.. దాని జనాల్లోకి తీసుకెళ్లాలా..? వద్దా ..? అని ఆలోచించి వెనక్కి తగ్గుతుంటారు. ముఖ్యంగా సమాజంపై చెడు ప్రభావం చూపించే ప్రకటనలు చేసేందుకు ససేమిరా అంటున్నారు.
‘కేజీయఫ్’ రెండు పార్ట్‌లతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ కొట్టగా చాప్టర్ 2 భారీ అంచనాలతో వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకుంది. ‘కేజీయఫ్2’తో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు యశ్. ఇక ఈ ఫాంలో తనకు వచ్చిన ప్రతి ఆఫర్‌ని చేయకుండా ఆచితూచి అడుగులేస్తున్నాడు యశ్. తాజాగా ఆయన వద్దకు వచ్చిన ఓ ప్రకటనను చేయనని నిర్మొహమాటంగా చెప్పేశారట.
ప్రముఖ పాన్ మసాలా ఉత్పత్తుల సంస్థ తమ బ్రాండ్ ప్రమోషన్‌లో పాల్గొనాలని యశ్‌ను కోరింది. అంతేకాదు, భారీ పారితోషికం కూడా ఆఫర్ చేసింది. కానీ, యశ్ సున్నితంగా దాన్ని తిరస్కరించాడని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. యశ్‌కు స్నేహితుడైన టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ హెడ్ అర్జున్ బెనర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పాన్ మసాలా యాడ్ చేయటం వల్ల ఆయన అభిమానులు, ఫాలోవర్స్‌పై ప్రభావం చూపుతుందని.. వారి ఆరోగ్యానికే ప్రమాదకరమని చెప్పారు. అందుకే యశ్ ఈ ప్రకటన చేయనని చెప్పేశారని అర్జున్ తెలిపారు. మరోవైపు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఇక నుంచి తాను పాన్ మసాలా వంటి ప్రకటనల్లో నటించనని చెప్పారు.