బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ల వివాహానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అంటూ కొద్దికాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే వాళ్లు ఆల్రెడీ పెళ్లి పనులు మొదలు పెట్టారు. డెకరేషన్, లైటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంతా రెడీ అనుకుంటున్న సమయంలో పెళ్లి వాయిదా పడింది. గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న వీరిద్దరి పెళ్లికి పెద్దల అనుమతి కూడా లభించింది. గతేడాదే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే మరోసారి అలియా- రణబీర్ పెళ్లి వాయిదా పడింది. మహేష్ భట్ కుమారుడు, అలియా హాఫ్ బ్రదర్ రాహుల్ భట్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
”పెళ్లి జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే… ఏప్రిల్ 13 లేదా 14 తేదీల్లో పెళ్లి జరగడం లేదు. నిజం చెప్పాలంటే… ఆ తేదీల్లో పెళ్లి చేయాలని అనుకున్నారు. మీడియాకు పెళ్లి తేదీ లీక్ కావడంతో ఒత్తిడి ఎక్కువ అయ్యింది. దాంతో ముహూర్తాన్ని మార్చారు. త్వరలో దీనిపై ప్రకటన వస్తుంది” అని జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ భట్ తెలిపారు. కొన్ని రోజుల కిందట ఏప్రిల్ 14న పెళ్లి అని మీడియాతో ఆలియా భట్ అంకుల్ రాబిన్ భట్ చెప్పారు. కుటుంబ సభ్యులే పెళ్లి తేదీ లీక్ చేశారన్నమాట.
ఇక ఈ పెళ్ళి వచ్చేవారానికి వాయిదా పడనుందని, ఏప్రిల్ 20న జరుగుతుందని అంటున్నారు. ఇదే విషయమై రణబీర్ తల్లి నీతూ కపూర్ మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ విషయం గురించి ఏమీ తెలియదని, ఎప్పుడు జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించటం గమనార్హం.