Site icon 123Nellore

‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్ష‌కుల‌కు వార్నింగ్‌… జర చూస్తోండి..!

స్టార్‌ హీరోల సినిమాలు విడుద‌ల‌య్యే స‌మ‌యంలో థియేట‌ర్ల‌లో అభిమానుల హంగామా మామూలుగా ఉండ‌దు. కొందరు ప్రేక్షకులు ఈల‌లు వేస్తూ, తెర వ‌ద్ద‌కు వెళ్లి డ్యాన్సులు చేస్తారు. అభిమాన హీరో తెరపై కనపడగానే కాగితాలు చించి స్క్రీన్‌పై వేయడాలు, స్క్రీన్‌కి హారతులు ఇవ్వడాలు చేస్తుంటారు. ఆ స‌మ‌యంలో ఇత‌ర ప్రేక్ష‌కుల‌కు స‌రిగ్గా క‌న‌ప‌డ‌క‌పోవ‌డ‌మే కాకుండా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాగే, తెర‌కు న‌ష్టం వాటిల్లే అవ‌కాశ‌మూ ఉంటుంది. విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో ఇటీవల రాధేశ్యామ్ సినిమా విడుదల రోజున అభిమానులు హీరో కనిపించగానే తెరపైనే పాలాభిషేకం చేసి క‌ల‌క‌లం రేపారు. ఇక మరికొన్ని చోట్ల భీమ్లా నాయక్‌ సినిమా వేళ థియేటర్లలోనే పటాసులు పేల్చి రచ్చ రచ్చ చేశారు.

ఇక ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మూవీ విడుదలను పురస్కరించుకుని థియేటర్లు అన్నీ సన్నద్ధమవుతున్నాయి. అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న కారణంగా థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా సినిమా హాళ్ల యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్క్రీన్ల ముందు మేకులు కొట్టించారు. తెరవ‌ద్ద‌కు వ‌స్తే అపాయం అని హెచ్చరిక బోర్టులు కూడా పెట్టారు.  దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

సినిమా విడుదల రోజున థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు కావాలని కొన్ని థియేటర్ల యజమానులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి అధికారులను కోరుతున్నారు. మరోవైపు ఆయా హీరో అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా చూసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేలా థియేటర్‌ ఓనర్లతో ఆయా నటీనటుల అభిమాన సంఘాల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అభిమానులు కాస్త జాగ్రత్త వహించడం మంచిది.

Exit mobile version