కేబినెట్‍లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేశామని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంత్రి వర్గ కూర్పులో సామాజిక న్యాయం చేశామని అన్నారు. రెండు రోజులుగా కసరత్తు చేసి మంత్రివర్గం జాబితా సిద్ధం చేసిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని అన్నారు.అన్ని రంగాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కేబినెట్‍లో 70% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారన్నారు. చంద్రబాబు హయాంలో 48 శాతమే బడుగు, బలహీన వర్గాలన్నారు.
గతంలో చంద్రబాబు కేబినెట్‍లో 52 శాతం బీసిలు ఉన్నారని, చంద్రబాబు ఏ సందర్భంలోనూ బీసీలకు న్యాయం చేయలేదని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పరిమితంగా ఉండే పదవుల్లో అత్యధిక సీట్లు ఇచ్చారని, పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకే బీసీలకు పదవులు ఇచ్చామని, అన్ని అంశాలు పరిశీలించాకే కేబినెట్ తుది జాబితా విడుదల చేశామన్నారు. వైసీపీ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తోందన్నారు. సామాజిక న్యాయం నినాదం కాదు..
నిజం చేశామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశామని తెలిపారు. ఎన్నికల కోసం చేసిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కాదని, పేదలకు పాలనలో సీఎం జగన్ భాగస్వామ్యం కల్పించారని స్పష్టం చేశారు. అయితే రాజీనామా యోచనలో మేకతోటి సుచరిత ఉన్నారని తెలుస్తోంది. స్పీకర్ ఫార్మాట్‍లో రాజీనామాకు సుచరిత యోచిస్తున్నట్లు సమాచారం. మాట్లాడేందుకు ప్రయత్నించినా సజ్జల పట్టించుకోలేదన్న గుసగుసలు వినబడుతున్నాయి.