Site icon 123Nellore

ఈ ఏడాది రూ.18.02 కోట్లతో ఆరు నగరవనాలు : మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్రంలో ప్రజలకు అహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, పచ్చదనాన్ని అందించేందుకు నగర వనాలను మరింత అభివృద్ధి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 23 నగరవనాలు, 7 టెంపుల్ ఎకో పార్క్ లు ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది పలమనేరు, కర్నూలు, పుట్టపర్తి, ప్రొద్దుటూరు, చిత్తూరు, మదనపల్లిలో కొత్త నగరవనాలను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మొత్తం రూ.18.02 కోట్ల వ్యయంతో 220.48 ఎకరాల్లో ఈ నగరవనాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలోని మొత్తం 120కి పైగా అర్భన్ లోకల్ బాడీలు ఉన్నాయని, వాటి పరిధిలో కనీసం ఒక్కో నగరవనం అయినా ఏర్పాటు చేయాలనేది అటవీశాఖ లక్ష్యంగా నిర్ధేశించామని తెలిపారు. ఇందుకోసం ఆయా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో అటవీశాఖ అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. నగరవనం కోసం ఈ ఏడాది 2022-23 లో 14.94 కోట్లు మేర రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని, వాటికి తోడు కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నగర వనాల్లో ఉదయపు నడక, పిక్ నిక్ స్పాట్ లుగా వినియోగించుకునేలా సదుపాయాలు కల్పించాలని అన్నారు. లోకల్ బాడీల పరిధిలో అయిదు కిలోమీటర్ల లోపు ఈ నగరవనాలను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని, దీనిపై అటవీశాఖ ప్రతిపాదనలు సిద్దం చేయాలని రాష్ట్రంలో ఎకో టూరిజం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఎకో టూరిజం (వనవిహారి) ప్రాజెక్ట్స్ ఉన్నాయని, ఈ ఏడాది పులికాట్, నేలపట్టు, కోరంగి, పాపికొండలు ఎకో టూరిజం ప్రాజెక్ట్ లను అభివృద్ది చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు.

Exit mobile version