10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడం సంతోషంగా ఉందని, చదువు అనేది మన పిల్లలకు మనమిచ్చే ఆస్తి అని, చదువు అనే ఆస్తిని ఎవరూ దొంగతనం చేయలేరని సీఎం జగన్ అన్నారు. తిరుపతిలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. తల్లుల అకౌంట్లలో రూ.709 కోట్ల నగదు జమ చేశారు. విద్యాదీవెన, వసతిదీవెన కింద ఇప్పటివరకు రూ.10,994 కోట్ల నగదు జమ చేసినట్లు జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ‘‘గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగార్చింది. ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూశా. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పుల పాలైన పరిస్థితి చూశా.
గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి వచ్చిన మార్పు గమనించండి. అవినీతికి తావులేకుండా నేరుగా తల్లుల అకౌంట్లలోనే వేస్తున్నాం. 10.85 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్లు జమ చేస్తున్నాం. ఇప్పటివరకు విద్యాదీవెన కింద రూ.10,994 కోట్లు వెచ్చించాం. జగనన్న వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు అందించాం. గత ప్రభుత్వంలో విద్యాదీవెన వంటి పథకం అమలైందా?. గత ప్రభుత్వం బకాయిలు కూడా మేమే చెల్లించాం. చంద్రబాబు వసతి దీవెన లాంటి పథకాన్ని అమలు చేశారా?
ప్రభుత్వ బడులలో సౌకర్యాల గురించి గత ప్రభుత్వం ఏనాడైనా పట్టించుకుందా? చంద్రబాబు ఏ రోజైనా ఇంగ్లీష్ మీడియం పెట్టే ఆలోచన చేశారా?. గతంలో జగనన్న అమ్మఒడి లాంటి పథకం ఏరోజైనా అమలైందా?. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులను పూర్తిగా మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాం. నాడు-నేడు లాంటి పథకం చంద్రబాబు ఏరోజైనా అమలు చేశారా?. మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం తట్టుకోలేకపోతోంది’’ అని విమర్శించారు.