బాలీవుడ్ స్టార్ హీరోల్లో సంజయ్ దత్ ఒకరు. ఆయన ఎంతో మందికి నటన పరంగా ఆదర్శం.. ఇక ఇప్పుడు ఆయన విలన్‌గా నటించి మెప్పిస్తున్నారు. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు సంజయ్. ఇక ఇటీవలే కేజీఎఫ్ 2 సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ సినిమాలో క్రూరమైన విలన్ అధీరాగా కన్పించి మెస్మరైజ్ చేశారు సంజయ్ దత్. ప్రస్తుతం కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు. తనకు డ్రగ్స్ ఎలా అలవాటు అయ్యింది అనే విషయాన్ని సైతం షేర్ చేసుకున్నారు. ‘అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే తెగ సిగ్గుపడేవాడిని. కానీ ఎలాగైనా వాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడిని. అందులో భాగంగానే డ్రగ్స్ వాడితే అమ్మాయిలకు కూల్‌గా కనిపిస్తానని, వాళ్లతో మాట్లాడే అవకాశం ఈజీగా లభిస్తుందని భావించాను. అలా డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాను.’ అని సంజూ భాయ్ చెప్పుకొచ్చారు. అయితే ఆ క్రమంలో డ్రగ్స్‌కి బానిసైన సంజయ్‌కు ఆ సంకెళ్లు తెంచుకోవడానికి చాలా కష్టపడానని చెప్పారు. అందరికీ దూరంగా ఒంటరి ప్రపంచాన్ని గడిపేవాడినని.. తన జీవితంలో ఆ పదేళ్లు రూమ్‌లో లేదా బాత్రూమ్‌లో గడిపేవాడినని తెలిపారు. ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికి రిహబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లటం, బాడీని బిల్డ్ చేసుకోవటం వంటివి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు చెప్పారు.
అయితే అంత గంభీరంగా కనిపించే సంజయ్ దత్.. తనకు కేన్సర్ మహమ్మారి సోకిందని తెలియగానే.. కొన్ని గంటలపాటు ఏడ్చినట్టు తెలిపారు. ‘‘కేన్సర్ అని నాకు చెప్పిన వెంటనే ఏడుపు ఆగలేదు. నా కుటుంబం, నా జీవితం ఏమైపోతుందా అన్న భయం ఏర్పడింది’’ అని చెప్పాడు. తాను కేన్సర్ పై ఎలా పోరాడింది? ఆయన వివరించారు. కీమో థెరపీతో ఎన్నో దుష్ప్రభావాలు ఎదురవుతాయన్న డాక్టర్ హెచ్చరికలను.. అయినా ఏమీ కాదంటూ భరోసా ఇవ్వడాన్ని గుర్తు చేసుకున్నారు.