చిత్ర పరిశ్రమలో ఇటీవల వేధింపుల వార్తలు గుప్పుమంటున్నాయి. కొందరు ధైర్యంగా వాటిని ఎదుర్కొంటుండగా.. మరికొందరు ఎవ్వరికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. తాజాగా మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌ను వేధింపులకు గురి చేసిన కేసులో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురంలో మే5న ఆయన్ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివకాల్లోకి వెళితే.. సనల్ కుమార్ దర్శకత్వంలో మంజు వారియర్ కయాట్టం అనే సినిమాలో నటించింది. అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా సనల్ కుమార్ అదే పనిగా తనకు మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేరాడని హీరోయిన్ ఆరోపించింది.
మంజు వారియర్ మే 4న దర్శకుడు సనల్ కుమార్‌పై తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మే 5న పోలీసులు తిరువనంతపురంలో ఉన్న సనల్ కుమార్ ఇంటికి మఫ్టీలో వెళ్లి సనల్‌ను అరెస్ట్ చేసి కొచ్చికి తరలించారు. దీంతో ఈ వార్త మలయాళం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది. మంజు వారియర్ ఫిర్యాదు మేరకు సనల్ కుమార్ ని అరెస్ట్ చేశామని కొచ్చి పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఫేస్‌బుక్ వేదికగా మే 1న శశిధరన్ చేసిన పోస్ట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. మంజూ వారియర్ జీవితం ప్రమాదంలో ఉందని ఆయన రాసుకొచ్చారు. ఆమె జీవితం ప్రమాదంలో ఉందని ఎంతోమందికి చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం ఆమె కొంతమంది కస్టడీలో ఉందన్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అందరూ పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో మంజూ పోలీసుల్ని ఆశ్రయించారు. తనని అవమానిస్తూ, బెదిరిస్తూ శశిధరన్ పోస్టులు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.