బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. మరోవైపు, ఆయన జీవితం ఎంతో రంగులమయంగా ఉంటున్నప్పటికీ.. అదే స్థాయిలో ఆయనను ఏదో ఒక సమస్య ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కృష్ణ జింకలను చంపిన కేసు సల్మాన్ ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉంది. అయితే తాజాగా సల్మాన్ ఖాన్‌కు ముంబైలోని స్థానిక కోర్టు సమన్లు జారీచేసింది.
అసలు కేసేంటంటే… 2019 ఏప్రిల్ 24న ఉదయం సల్మాన్ ముంబైలోని ఓ వీధిలో సైకిల్ తొక్కారు. అదే సమయంలో జర్నలిస్ట్ అశోక్ పాండే.. సల్మాన్ బాడీగార్డ్ అనుమతి తీసుకుని అతడిని ఫోటోస్..వీడియోస్ తీయడం ప్రారంభించాడు. దీంతో సల్మాన్ కొపగించుకుని.. తన బాడీగార్డ్‌తో తనను కొట్టించారని.. ఆ తర్నాత తన ఫోన్ లాక్కొని బెదిరించారని జర్నలిస్ట్ అశోక్ పాండే ఆరోపించారు. ఈ విషయంపై కేసుకు సంబంధించి బాధిత జర్నలిస్టు అశోక్ పాండే చేసిన ఫిర్యాదు మేరకు… సల్మాన్ ఖాన్, ఆయన బాడీ గార్డ్ నవాజ్ షేక్ లకు అంధేరీ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్లు 504, 506 కింద కేసులు పోలీసులు కేసు నమోదు చేసినట్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సమన్లు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ 5కి వాయిదా వేసింది. అయితే కోవిడ్ కారణంగా ఇన్ని రోజులు సల్మాన్‌కు శిక్ష ఆలస్యమైందని.. చివరకు కోర్టు.. సల్మాన్.. అతని బాడీగార్డ్ పై చర్యలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అశోక్ పాండే పేర్కొన్నాడు.