Site icon 123Nellore

అందుకే పొట్టి డ్రస్సులు వేసుకోవటం లేదు: సాయి పల్లవి

అందంతో పాటు అభినయంతోనూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న భామ సాయి పల్లవి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. డాక్టర్‌ నుంచి యాక్టర్‌గా మారి విభిన్న కథలతో ప్రేక్షకులకు చేరువైంది. ‘ప్రేమమ్‌’తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగువారికి చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటించిన ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీ ‘విరాటపర్వం’. 1990ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటుడు రానా.. రవన్న అనే విప్లవ నాయకుడిగా నటించారు. వేణు ఊడుగుల దర్శకుడు. జూన్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఇంట్లో ఎక్కువగా తెలుగులో మాట్లాడుతుండడంతో తెలుగబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటావా..? అని ఇంట్లో అంటుంటారని చెప్పుకొచ్చారు. చదువుతున్న సమయంలో తనకు 23 ఏళ్ల వయసులోనే పెళ్లి అయిపోతుందని.. 30 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉంటారనుకున్నానని.. తెలిపారు. ఇదే సమయంలో గ్లామర్ షోకి ఎందుకు దూరంగా ఉంటారని ప్రశ్నించగా.. పొట్టి బట్టలు వేసుకోవడంతో తప్పు లేదని.. కానీ ఎదుటివారి చూపుల్లో మార్పు వచ్చినప్పుడు తనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పుకొచ్చారు.

‘‘వైద్య విద్య నేర్చుకోవడానికి జార్జియా వెళ్లినప్పుడు అక్కడ టాంగో డ్యాన్స్‌ నేర్చుకున్నాను. టాంగో డ్యాన్స్‌ నేర్చుకోవాలంటే.. దానికి వీలుగా ఉండే కాస్ట్యూమ్స్‌ మాత్రమే ధరించాలి. అదే విషయాన్ని అమ్మ వాళ్లకు చెప్పి వాళ్లు ఓకే అన్నాక, దుస్తుల విషయంలో నేనూ సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకే ‘ప్రేమమ్‌’లో నటించే అవకాశం వచ్చింది. అందరి నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో నేను జార్జియాలో చేసిన టాంగో డ్యాన్స్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. నెటిజన్లు దాన్ని చూసి, కామెంట్స్‌ చేసిన విధానం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ క్షణం నుంచి పొట్టి దుస్తులకు నో చెప్పడం మొదలుపెట్టాను’’ అని సాయిపల్లవి తెలిపారు.

 

Exit mobile version