Site icon 123Nellore

రాష్ట్రంలో రివర్స్ పాలన : చంద్రబాబు

ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాల్లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన  కొనసాగుతోంది. తొలి రోజు బుధవారం చోడవరంలో జిల్లా మాహానాడు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు రెండో రోజు అనకాపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం అనకాపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి ప్రసంగించిన టిడిపి అధినేత….రాష్ట్రంలో జగన్ పాలన రివర్స్ లో సాగుతుందని దుయ్యబట్టారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి క్విట్ జగన్- సేవ్ ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో అంతా పోరాడాలని పిలుపునిచ్చారు. డ్రైవింగ్ రాని వారిని సీట్లో కూర్చోపెడితే…వాహనం ఎటుపోతుందో తెలీదని, ఇప్పుడు జగన్ పాలన కూడా అలాగే ఉందని చంద్రబాబు అన్నారు. నిన్నటి సభలో పోలీసుల సమస్యలపై మాట్లాడితే వెంటనే ప్రభుత్వం పెండింగ్ బకాయిలు విడుదల చేశారని… ఉద్యోగుల గురించి పోరాటం చేసేది, గళం ఎత్తేది తామే అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో సైకో పాలన సాగుతుంది అని చెప్పిన టిడిపి అధినేత…అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడుతున్న వారికి అంతకు అంతా తిరిగి చెల్లిస్తాం అన్నారు. పార్టీ అధికారంలోకి రావడం తథ్యం అని జోష్యం చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లిలోని చంద్రశేఖర కళ్యాణ మండపంలో పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. రేపు చీపురుపల్లి, నెల్లిమర్లలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని, రోడ్ షో నిర్వహించనున్నారు.

Exit mobile version