వైద్య ఆరోగ్య శాఖ లో 40వేలకుపైగా నియామకాలు చేపట్టామని, అన్ని రోగాలకూ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మంచినీటి కొరత, అపరిశుభ్రత, నిర్వహణలో లోపాలు, టాయిలెట్లు సరిగా లేకపోవడం లాంటివి గమనిస్తూనే ఉన్నామన్నారు.‘‘ చిన్న చిన్న సమస్యలైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పెద్దవిగా కనిపిస్తున్నాయి. సరైన సమయంలో స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరించాలను అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ఎఎన్ఎంలు, ఇతర ఫీల్డ్ సిబ్బంది బయోమెట్రిక్ విధానం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. వారి అభ్యర్థనలోనూ న్యాయం ఉన్నందున ప్రత్యామ్నాయ పద్ధతులను ఆలోచించాలి.
ఎన్ హెచ్ ఎం నిధులను సక్రమంగా వినియోగించుకోవడంలేదని, మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఆ నిధులు మురిగిపోతున్నాయనే వార్తలొస్తున్నాయి. ఏ ఆస్పత్రిలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదు. ఎన్ హెచ్ ఎం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంటే.. ఇప్పటికీ కొన్ని పీహెచ్‌సీల్లో మందులు బయటకు రాస్తున్నారు. ఎక్కడా, ఎప్పుడూ టెస్టులుగాని, మందులుగాని బయటకు రాయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీల్లో కాన్పులు జరిగేలా చొరవ చూపాలి.
ప్రతి పీహెచ్‌సీలో నెలకు కనీసం 10 కాన్పులైనా జరిగేలా ప్రయత్నించాలి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో కాన్పులు జరగకపోవడం వల్ల టీచింగ్, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఏపీ ఎం ఎస్ ఐడీసీ ద్వారా కొనుగోలు చేస్తున్న పరికరాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. నాణ్యతను పరిశీలించే టెక్నికల్ టీమ్‌లో సంబంధిత వైద్యులు కూడా ఉండేలా చూడాలి. ప్రభుత్వ ఆశయాలకు, జగనన్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం మనందరిపైనా ఉంది.’’ అని అన్నారు.