టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి బీజేపీ నేత పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి నాయకత్వం వహించబోయేది నారా లోకేష్ అంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో… టీడీపీని నడిపించే సామర్థ్యం లోకేష్ కు ఉందా? లోకేష్ పెద్దమ్మగా మీరు ఏమి చెపుతారు? అంటూ ఓ మీడియా చానల్ అడిగిన ప్రశ్నకు పురంధేశ్వరి సమాధానం ఇచ్చారు. లోకేష్ తల్లి భువనేశ్వరి సోదరిగా తన ఆశీర్వాదాలు లోకేష్ కి ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. ఆయన సొంత లక్ష్యాలను, మార్గాన్ని ఆయన నిర్దేశించుకోవచ్చని తెలిపారు. ఇక తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేశ్ చెంచురామ్ ఇద్దరూ వైసీపీలో లేరని పురందేశ్వరి స్పష్టం చేశారు.
తన కుమారుడు హితేశ్ పుట్టుకతోనే అమెరికా పౌరుడని చెప్పారు. యూఎస్ సిటిజెన్ షిప్ ను వదులుకునే ప్రక్రియలో జాప్యం జరిగిందని… అందువల్ల గత ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలనే ఒత్తిడి తన భర్త వెంకటేశ్వరరావుపై పడిందని, అందుకే ఆయన పోటీ చేశారని చెప్పారు. కుటుంబంలో ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉండాలనే భావన తన భర్తదని అన్నారు.
తాము వేర్వేరు పార్టీలలో ఉండటం సమంజసం కాదనేది ఆయన అభిప్రాయమని… అందువల్ల ఆయన వైసీపీకి దూరం జరిగారని తెలిపారు. తన భర్త, కుమారుడు ఇద్దరూ వైసీపీలో లేరనేది చాలా స్పష్టమైన విషయమని చెప్పారు. తన కుమారుడు ప్రస్తుతం బిజినెస్ చూసుకుంటున్నారని.. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉందని… రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషించాలా? వద్దా? ఏ పార్టీ నుంచి పోటీ చేయాలి? అనే నిర్ణయాలను హితేశ్ తీసుకుంటారని పురందేశ్వరి చెప్పారు. సొంత నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛను తాము తమ బిడ్డలకు ఇచ్చామని తెలిపారు.