దివంగత కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా కోసం దక్షిణాదినే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. మార్చి 17 పునీత్ జయంతి సందర్భంగా.. అదేరోజున కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 4,000 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.
పునీత్ మరణించి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎవరు అంత ఈజీగా ఆయనను మర్చిపోవడం లేదు. ఇంకా పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్దకు రోజుకు వేలాది మంది అభిమానులు వచ్చే నివాళులర్పిస్తూనే ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా పునీత్‌కి అన్ని చిత్ర పరిశ్రమల్లోని వ్యక్తులతో మంచి సంబంధాలున్నాయి. తెలుగులోనూ మెగా ఫ్యామిలీ, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్‌లతో సాన్నిహిత్యం ఉంది. సన్నిహితులు, అభిమానులు పునీత్‌ని ప్రేమగా ‘అప్పూ’ అని పిలుస్తుంటారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అప్పూ ఒక భద్రతాసంస్థలో మేనేజర్, సైన్యాధికారిగా రెండు పాత్రలు పోషించాడు. ప్రియా ఆనంద్ జోడీగా నటించింది. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పక పోయినప్పటికీ అత్యధిక టెక్నాలజీతో షూటింగ్‌లో చెప్పిన డబ్బింగ్‌ను ఒరిజినల్ సినిమాలో మిక్స్ చేశారు. ఆయన సొంత అన్నయ్య పునీత్ అన్నయ్య శివరాజ్‌కుమార్‌తో డబ్బింగ్ పూర్తి చేయించారు.
సినిమాలో ఒక పాట, కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉన్న సమయంలోనే గతేడాది అక్టోబరులో పునీత్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. దాంతో మిగిలి భాగం షూటింగ్ పూర్తి చేయకుండానే కథలో కొద్ది మార్పులు చేశారు. తెలుగు హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా నటించాడు. ఇక ఈ చిత్రం విడుదల అవుతున్న రోజు నుంచి వారం దాకా మార్చి 22 వరకు ఇతర సినిమాలేవీ విడుదల చేయొద్దని కన్నడ పరిశ్రమ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అభిమానులు సైతం ఈ చివరి సినిమాని సూపర్‌డూపర్ హిట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. బెంగళూరులో మెజెస్టిక్ థియేటర్‌లో పునీత్ 81 అడుగుల భారీ కటౌట్ పెట్టబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వారం రోజుల టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. విడుదలైన నాలుగురోజుల్లోనే ట్రైలర్‌కి 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.