అనంతపురం జిల్లా ధర్మవరం పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అదికూడా రెండు పార్టీల మధ్య కాదు. ఇద్దరి వ్యక్తుల మధ్య. గత ఎన్నికల్లో ధర్మవరం నుండి పోటీ చేసి ఓటమి చెందిన వరదాపురం సూరి ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. తన ఆస్తులు, కేసుల నుండి తప్పించుకునేందుకు బీజేపీలో చేరారని వినికిడి. తదనంతరం అక్కడ పార్టీ కార్యకర్తలను ఆదుకునే దిక్కు లేకపోవడంతో దృష్టి పెట్టిన అధినేత చంద్రబాబు పరిటాల శ్రీరామ్ సమర్ధుడని గుర్తించి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుండి శ్రీ రామ్ దూకుడుగా వ్యవహరిస్తూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. సవాల్ కు ప్రతిసవాళ్ళు విసురుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ధర్మవరం టీడీపీ సీటు తనదేనని వరదాపురం సూరి అన్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. అధికారికంగా సూరి ప్రకటించకపోయిన పుకార్లు మాత్రం బాగానే వస్తున్నాయి. అయితే దీనిపై నెల క్రితమే పరిటాల శ్రీరామ్ స్పందించారు. పార్టీ నుండి వెళ్లిన వ్యక్తి మళ్లీ వస్తున్నారు..వస్తే పార్టీలోకి కండువా వేసి ఆహ్వానిస్తాం..పోటీ చేసేది మాత్రం నేనే అంటూ గౌరవసభలో మాట్లాడారు. అధినేత తనపై నమ్మకంతోనే ధర్మవరం పంపారని, తానే పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు.
ధర్మవరం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కూడా ధర్మవరం నుండి పరిటాల శ్రీరామే పోటీ చేస్తారని కూడా ప్రకటించారు. దీంతో ధర్మవరంపై పరిటాల శ్రీరామ్ పూర్తిగా పట్టు సాధించేందుకు దూకుడు పెంచారు. ముందస్తు ఎన్నికలు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో మళ్లీ పార్టీలోకి సూరి వచ్చేందకు పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎవరు ఎలాంటి ప్రచారాలు చేసుకున్నాధర్మవరంలో శ్రీరామ్ బరిలో ఉంటారని టీడీపీ నేతలంటున్నారు. రెండేళ్ల ముందే టీడీపీ టికెట్ పై వస్తున్న ప్రచారాలతో రాజకీయ వేడి రేగుతోంది.