ప్రత్యేక హోదా అంశాన్ని అజెండా నుంచి తొలగించడం ముమ్మాటికీ కుట్రేనని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ కుట్ర వెనుక చంద్రబాబు ఉన్నారని నిప్పులు చెరిగారు. అజెండాలోని 9 అంశాలను వాళ్లే పెట్టి వాళ్లే తీసేశారని తెలిపారు. చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే ఇలా ప్రవర్తించారని, ప్రత్యేక హోదా వద్దని అమ్ముడుపోయింది టీడీపీ నేతలేనని మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలని తీసుకుంది టీడీపీనేని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. ఏపీని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే సీఎం జగన్ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని తెలిపారు.
ఏపీలో బీజేపీ, జనసేన నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ఈ రెండు పార్టీలు లోపాయికారిగా చంద్రబాబుతో చేరతాయని ఆరోపించారు. గడచిన మూడురోజులుగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారని గుర్తు చేశారు. కానీ ఎనిమిదేళ్లు అయిపోతున్నా కనీసం హోదా ప్రస్తావనే లేదన్నారు. త్రిసభ్య కమిటీ అజెండాలో హోదా అనే అంశాన్ని పెడితే సంతోషించామని, హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆశపడ్డామని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్లు బీజేపీతో కలిసుండి హోదాకు మంగళం పాడారని విమర్శించారు. ప్రత్యేక హోదా చంద్రబాబు, టీడీపీ నేతలు ఏం అర్హత ఉందని హోదాపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
బీజేపీ నుంచి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను చంద్రబాబు బీజేపీలోకి పంపించాడని మండిపడ్డారు. తమకు ప్రజల అండ ఉన్నంతవరకు ఎవరి మద్దతు అవసరం లేదని, ఎవరు ప్రజల పక్షమో.. ఎవరు కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. తమవాళ్లు భూములు కొన్నాక రాజధానిని ప్రకటించిన వ్యక్తి చంద్రబాబు అని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు