Site icon 123Nellore

చంద్రబాబు పల్లకీ మోస్తానని పవనే చెప్తున్నారు : అంబటి రాంబాబు

పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చూస్తే బీజేపీతో ఏదో గొడవపడి టీడీపీకి వచ్చేస్తున్నా అని స్పష్టమైన సంకేతాలు ఇవ్వటానికి ఒక మీటింగ్‌ అనే డ్రామా ఆడినట్టుందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఇది బాబూ.. వచ్చేస్తున్నా మీటింగ్‌ అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి అంబటి కౌంటర్ ఇచ్చారు. కౌలు రైతులమీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ, అభిమానం ఉన్నాయి కాబట్టే, చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా రైతులకే కాకుండా, కౌలు రైతులకు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులకు కూడా జగన్‌ ప్రభుత్వం వైయస్సార్‌ రైతు భరోసాగా ఏటా రూ.13,500 చొప్పున అయిదేళ్లలో రూ.67,500 అందిస్తోందన్నారు.

 

భీమవరం, గాజువాక రెండు చోట్ల పోటీచేసి టీడీపీలో పోటీలో లేకపోయినా పవన్‌ కల్యాణ్‌ ఓడిపోయారని, అలాంటిది 2024లో వైసీపీ గెలవదని శాపనార్థాలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 2019కి ముందు జగన్‌ ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారని గుర్తు చేశారు. రాజకీయ సన్యాసం చేస్తే ప్యాకేజీలు రావని నిస్సిగ్గుగా వైసీపీపై చేస్తున్న విమర్శలు  కనిపిస్తున్నాయన్నారు. ఇలాంటి పల్టీ నాయకుడిని చూసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భయపడిపోదన్నారు.

ఎవరి పల్లకీ మోయను అంటూనే చంద్రబాబు పల్లకీ తప్ప అన్న కండిషన్‌ పెట్టుకున్నట్టుగా, అదే పవన్ పరమార్థం అన్నట్టుగా కనిపిస్తోందన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ వ్యతిరేక ఓటును చీల్చాలి, వైసీపీ అధికారంలో ఉంటే.. వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని, ఇదే పవన్‌ కల్యాణ్‌కు తెలిసిన రాజకీయమన్నారు. ఇదే చంద్రబాబు ఆయనకు ఇచ్చిన ఎసైన్‌మెంట్‌ అన్నారు.  దీనికోసం ఆయన కాపుల్ని వాడుకుంటాడు, రైతుల పేరు చెపుతాడు… ఏదైనా మాట్లాడతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Exit mobile version