ప్రజల వద్దకు వెళ్లేందుకు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు మొదటి రోజే షాక్ తగిలింది. ప్రభుత్వం మూడేళ్లో చేసిన అభివృద్ధిని గురించి చెప్పాలనుకున్న అధికార పార్టీ నేతలకు చుక్కెదురైతోంది. రాష్ట్రంలో పలుచోట్ల ప్రజల గుమ్మం తొక్కుతున్న మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై స్థానిక ప్రజలు తిరగబడ్డారు. ఆదోని మండలం విరుపాపురంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో సమస్యలున్నాయని, ప్రభుత్వం ఏమీ చేయడంలేదని మండిపడ్డారు. నీటి సమస్య, పెన్షన్ సమస్య, రేషన్ తొలగింపుపై నిలదీశారు.
సమస్యలు మీకు చెప్పినా ఒకటే… గోడకు చెప్పినా ఒకటే అంటూ ఓ వృద్ధురాలు తీవ్ర స్థాయిలో మండిపడింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్యాస్, నిత్యాసరాల ధరలు పెరిగాయని, కరెంట్ ఛార్జీలు పెంచారంటూ అసహనం వ్యక్తం చేశారు. చెత్త పన్ను ఎందుకు కట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గుమ్మనూరు జయరాంకు నిరసన సెగలు తప్పలేదు. హత్తిబెళగల్‌లో పర్యటించిన జయరాంను ఆలూరు-హత్తిబెళగల్ ప్రధాన రహదారి నిర్మించాలని ఆందోళనకు దిగారు. పత్తికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిని మద్దికెరలో నిలదీశారు. ప్లాస్టిక్ బియ్యం తిని అస్వస్థకు గురవుతున్నామని తెలిపారు. తనకు పింఛన్ రావడం లేదంటూ ఓ వృద్ధురాలు ధ్వజమెత్తింది.
హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్‍ను నిలదీశారు. ఊర్లోకి రోడ్లు సరిగా లేవని, మూడేళ్లుగా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పథకాలకు డబ్బులు రావట్లేదంటూ డిప్యూటీ సీఎం రాజన్న దొరను ప్రజలు ప్రశ్నించారు. జనం నిలదీస్తుండడంతో సమస్యలు వినకుండా వెళ్లిపోయారు. నంద్యాల జిల్లాలోలోని బేతంచర్లలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు మహిళలు సమస్యలు మొరపెట్టుకున్నారు. ఉగాది నుంచి ఉపాధి హామీ డబ్బులు రావట్లేదని ఫిర్యాదు చేశారు. వారంలో డబ్బులు వస్తాయని హామీ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయారు.