టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మీడియాతో ఏదిపడితే అది మాట్లాడవద్దని నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో శనివారం రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలకు పలు సూచనలు చేశారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పార్టీలో సమైక్యత అవసరమని అన్నారు. కాంగ్రెస్ మన కుటుంబం అని, పనిచేసినవారికే టికెట్లు ఇస్తాం అని స్పష్టం చేశారు. పనిచేయకపోతే సీనియర్ నేతలకైనా టికెట్లు రావన్నారు. ప్రజలకు చేరువగా ఉండేవారికే టికెట్లన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ బాగుపడ్డాక ఏర్పడింది ఒక కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. భవిష్యత్ లో ఎవరితోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన వారితో పొత్తులు ఉండవు అని పేర్కొన్నారు. కలిసి పనిచేద్దాం.. తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందన్నారు. విద్యాఉపాధి రంగాలను దోచుకుంటున్న టీఆర్ఎస్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆహ్వానిస్తోందని, టీఆర్ఎస్ ను ఓడించేందుకు అందరం కలిసి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. తెలంగాణ సంపదను టీఆర్ఎస్ దోపిడీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల పోరాటంలో నిజాయితీ ఉందని, తెలంగాణ ప్రజల్ని సఫలీకృతుల్ని చేస్తామన్నారు. నేతలతో కలిసి నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజల మధ్యకు మనం వెళ్లాల్సిన సమయం వచ్చిందని, సమావేశం చివరిలో హైదరాబాద్ చాయ్, బిర్యానీ చాలా బాగుంటుందన్నారు. అంతక ముందు చంచల్ గూడ జైల్లో స్టూడెంట్ యూనియన్ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు.