గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకృష్ణమోహన్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించొద్దని, జగనన్న అభిమానులు, వైసీపీ కార్యకర్తల పేరిట.. ఎంపీ విజయసాయిరెడ్డికి కొందరు లేఖ రాశారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అంతేకాదు..కొన్ని పోస్టర్లు చక్కర్లు కొడుతున్నయి.‘టీడీపీ ఎమ్మెల్యే మాకు వద్దు..జగన్ అన్న మాకు ముద్దు.. మా ఇంట్లో శుభకార్యం మేము చేసుకుంటాము కాని నువ్వెడివయ్యా..మా ఇంట్లో శుభకార్యాన్ని నువ్వు ఎవడివి చేయడానికి అసలు..మన ఇంట్లో శుభకార్యం మనమే చూసుకుందా పక్కింటోడికి మనం ఎందుకు ఇవ్వాలి’ పోస్టర్లు వేశారు.
అంతేకాదు వారు రాసిన లేఖలో నియోజకవర్గ బాధ్యతలు వంశీకి తప్ప ఎవరికి కేటాయించినా.. 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాటు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని కాపాడామని వారు లేఖలో తెలిపారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి, టీడీపీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతు ప్రకటించారని ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ జెండా మోసిన వైసీపీ కార్యకర్తలు.. ఇప్పటికీ అక్రమ కేసుల వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా కుదేలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి నియోజకవర్గ బాధ్యతలను.. వల్లభనేని వంశీకి తప్ప ఎవరికి కేటాయించినా.. 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని లేఖలో పొందుపరిచారు. నియోజకవర్గంలో పార్టీని కాపాడేందుకు సత్వరమే నూతన ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇంఛార్జ్ బాధ్యతలు వంశీకి అప్పగిస్తే మాత్రం కలిసి పని చేసేది లేదని ఇప్పటికే దుట్టా రామచంద్రరావు ప్రకటించారు. అయితే తనకు గానీ, యార్లగడ్డ వెంకట్రావుకు గానీ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి.