అసలే ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నింటాయి. రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశంలో కేవలం 16 రోజుల్లో 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరలపై సోషల్ మీడియాలో మిమీలు, జోకులతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు, పెట్రోల్, డీజిల్ బంగారం కంటే ఖరీదైన వస్తువుగా మారాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో జరిగిన ఓ పెళ్లివేడుకలో కొత్తగా పెళ్లైన జంటకు పెట్రోల్, డీజిల్ బాటిళ్లను బహుమతిగా ఇచ్చి స్నేహితులు సర్ ప్రైజ్ చేశారు.
తమిళనాడులోని చంగల్‌పట్టు జిల్లా చెయ్యూరులో గిరీశ్ కుమార్, కీర్తన జంట వివాహ వేడుక జరిగింది. ఈ నూతన వధువరులతో కలిసి ఫొటో దిగేందుకు వేదికపై వచ్చిన స్నేహితులు ఒక్కసారిగా ఒక కవర్‌లో నుంచి రెండు బాటిళ్లు బయటకు తీశారు. ఆ బాటిళ్లు పెట్రోల్, డీజిల్‌తో నింపి ఉన్నాయి. వాటిని ఆ నూతన వధూవరులకు బహుమతిగా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పెరుగుతున్న పెట్రో ధరలకు వినూత్నంగా నిరసన తెలిపామన్నారు దంపతుల స్నేహితులు. ఒకవైపు పెట్రో ధరలు భారీగా పెరిగిపోయిన సమయంలో స్నేహితులు ఇచ్చిన ఈ పెట్రోల్, డీజిల్ బాటిళ్ల బహుమతి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కంటే ఖరీదైనవి మరేదీ లేదంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Amidst rising #PetrolDieselPriceHike, friends of the newly married couple, Girish Kumar and Keerthana decided to gift the couple One Litre #petrol and One Litre #diesel as a wedding present at their Wedding reception in Cheyyur in Chengalpattu district #FuelPriceHike pic.twitter.com/Wr3BErZUwg
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) April 7, 2022
ఇక తమిళనాడులో లీటర్ పెట్రోల్ కి రూ.110.85 పైసలు, డీజిల్ కి రూ. 100.94 పైసలుగా ఉంది. పెరుగుతున్న నిత్యావసర ధరలతో పాటు భగ్గుమంటున్న ఇంధన ధరలు సామాన్య ప్రజానికానికి చుక్కలు చూపిస్తున్నాయి.