కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు పూర్తయిందిని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టమని, వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉటుందన్నారు. చిన్న చిన్న మార్పులతోనే తుది నోటిఫికేషన్ వెలువడబోతుందని పేర్కొన్నారు. సీవీక్ సొసైటీల సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, 90 శాతం ప్రభుత్వ భవనాల్లోనే కొత్త జిల్లాల కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని వివరించారు.
కొత్త జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్, పోలీసు అడ్మినిస్ట్రేషన్ ఒకేచోట ఉండేలా నిర్ణయంచామని, కొత్తగా నిర్మించే శాశ్వత భవనాలు 15 ఎకరాల్లో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 2023 నాటికి మొత్తం కొత్త జిల్లాల శాశ్వత భవనాలు పూర్తవుతాయని అన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని, డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. ఎకరాకు 2 కోట్లు అవసరమని సీఎం లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చెప్పారరన్నారు.
కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా? అని ప్రశ్నించారు. రూ. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం ఏంటిని, ఆచరణ సాధ్యంకాని ఆదేశాలు కాబట్టే సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారని అన్నారు. మంత్రివర్గ విస్తరణ మొత్తాన్ని సీఎం చూస్తున్నారని, సోషల్ జస్టిస్ కు అనుగుణంగానే మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా కేబినెట్ కూర్పు ఉంటుందని, మెజార్టీగా కేబినెట్ లో మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు.