ఖరీఫ్ పనులు మొదలు కాక మునుపే వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కేలండర్ ఇచ్చి క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ‘‘వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సాయం. మొత్తంగా ఈ నెలాఖరుకల్లా 50 లక్షల మందికిపైగా రైతన్నలకు రూ.7,500 చొప్పున రూ.3,758 కోట్లు జమ. రెండో విడత అక్టోబర్‍లో రూ.4 వేలు, మూడో విడత జనవరిలో రూ.2వేలు. మూడు విడతల్లో రైతన్నల ఖాతాల్లో రూ.13,500 జమ.
అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో గ్రౌండ్ లెవల్ వాటర్ పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16లక్షల టన్నులు పెరిగింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థికసాయం. ఆక్వా జోన్‍లో ఉన్న పదెకరాల వరకు రూపాయిన్నర విద్యుత్ సబ్సిడి వర్తింపు. పరిహారం దక్కని ఒక్క రైతును కూడా చంద్రబాబు దత్తపుత్రుడు చూపించలేకపోయాడు. పంట సీజన్ ముగిసేలోగా పరిహారం అందజేస్తున్నాం.
రైతులపై కాల్పులు జరిపి చంపించిన నాయకుడు, ఉచిత విద్యుత్ వద్దు, వ్యవసాయం దండగ అన్న గత పాలకుడి పాలన గుర్తు చేసుకోండి. మాటలు చెప్పి రైతుల్ని గాలికి వదిలేశారు. ప్రశ్నించాల్సిన సమయంలో ఎందుకు ప్రశ్నించలేదో దత్తపుత్రుడు చెప్పాలి. ఆ రోజు దత్తపుత్రుడు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదు.? గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలి. రైతు భరోసా పథకం గతంలో ఉండేదా?. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వం ఏనాడైనా చూశారా?.’’ అని ప్రశ్నించారు.