కేసీఆర్ కొత్త భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఆస్)కి మహూర్తం ఫిక్స్ అయిందా.? గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో అంతరంగికంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో పార్టీ ప్రకటన తేదీని ఖరారు చేశారా.? అందరిలో ఉత్కంఠ రేపుతున్న ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా దేశంలో కొత్త జాతీయ పార్టీ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ కొనసాగుతుందా.? లేదా అన్నది సందిగ్ధ అంశంగా మారింది. వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.
అప్పటి వరకు టీఆర్ఎస్ ఉంటుందా..లేక బీఆర్ఎస్ ఉంటుందా అన్న ప్రశ్నలకు మరి కొన్ని రోజుల్లో సమాధానం దొరకనుంది. ఈనెల 19, 20 తేదీల్లో కేసీఆర్ తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనికోసం కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చే అంశాన్ని రెండు మూడు రోజుల్లో జరిగే సమావేశంలో ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. జాతీయ పార్టీని ఏ విధంగా రూపాంతరం చెందాలన్న దానిపై చర్చ జరుగుతోంది.
పార్టీ జెండా గులాబీ రంగులోనే ఉంటుందా..లేక మార్చుతారా అన్నది తెలియాల్సి ఉంది. పాత జెండాలో తెలంగాణ రాష్ట్ర నమూనా చిత్రం ఉంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే జెండాలో ఏం ఉంటుదోనన్న ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందన్న ప్రకటన కూడా చేసే అవకాశం ఉంటుందా.? లేదా అన్నది ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.