టాలీవుడ్ నటుడు మోహన్ బాబు చిత్రపరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీపరిశ్రమ మెుత్తం ఓకే కుటుంబం అని చెప్తూనే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ వారి గోతులు వారే తవ్వుకుంటున్నారని విమర్శించారు. మూడేళ్ల విరామం తర్వాత మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రం విడుదలైంది. ఆ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో జరుగుతున్న వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రితో భేటీకి తనకు కూడా ఆహ్వానం ఉందని.. కానీ కావాలనే కొందరు తనని దూరం పెట్టారని మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పలువురు నటులు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని.. ఆ వార్తలపై స్పందించాలని విలేకరి అడ్డగ్గా పారితోషకాల విషయంపై ఎటువంటి కామెంట్స్ చేయనని.. తన గురించి మాత్రమే మాట్లాడతానని అన్నారు. బయట రాజకీయాల మాదిరిగానే సినీ పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయన్న మోహన్ బాబు ఎవరికి వారే గ్రేట్ అనుకుంటున్నారని మండిపడ్డారు. మనం చేసే పనులన్నింటినీ పైన భగవంతుడు చూస్తున్నాడని హితవు పలికారు.
సినిమా టికెట్ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడటానికి అందరం కలిసి వెళ్దామని రెండు నెలల క్రితం బహిరంగ లేఖ విడుదల చేశానని… కానీ ఎవరూ స్పందించలేదని చెప్పారు. ‘నేనే గొప్ప’ అనే అహంకారం వల్లే సినీ ఇండస్ట్రీలో అందరం కలువలేకపోతున్నామని చెప్పారు. తన దృష్టిలో ఎవరూ గొప్ప కాదన్నారు. గతంలో అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలంతా కలిసి ఉండేవాళ్లని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మోహన్ బాబు అన్నారు. ఇక తనపై వస్తున్న ట్రోల్స్‌పై కూడా ఆయన స్పందించారు. ట్రోల్స్ నవ్వించేలా ఉండాలి కానీ అసభ్యకరంగా ఉండకూడదన్నారు. ఓ ఇద్దరు హీరోలు కొంతమందిని పెట్టుకొని ఇలాంటి ట్రోల్స్ క్రియేట్ చేస్తున్నారని ఆ హీరోలు ఎవరో కూడా నాకు బాగా తెలుసని అన్నారు. వాళ్ళు తాత్కాలిక ఆనందం పొందవచ్చు. కానీ ఏదో ఒక సమయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు.