అమరావతి రాజధాని రైతుల ఉద్యమం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ఏపీలో జగన్ సర్కారు వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా తొలగించి.. రాష్ట్రానికి 3 రాజధానులంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రజలు, రైతులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర ప్రారంభించి తిరుపతిలో ముంగిపు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు మద్దతు పలికారు. వీరితో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు.
కానీ, వైసీపీ నేతలు మాత్రం ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూముల ధరలు పెంచుకోవడం కోసం.. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు ప్రాంతాల ప్రజలు పన్నులు కడుతుంటే సమావేశంలో పాల్గొన్న నాయకులు కేవలం అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు మాత్రమే బాగుండాలని కోరుకోవడం దారుణమని అన్నారు. ఇంతకాలం సీఎం జగన్పై దొంగల్లా దాక్కొని విషం కక్కుతున్నారని రోజా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తిరుపతిలో నిర్వహించిన అందరితీ అమరావతి అనే సభపై రోజా విమర్శలు గుప్పించారు.
చంద్రబాబుతో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. చంద్రబాబుతో సహా సమావేశంలో పాల్గొన్న నాయకులంతా… ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ద్రోహం తలపెట్టాలని చూస్తున్నట్లు ఆరోపించారు. మరి ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎలా తిరగబడతాయో చూడాలి. దీంతో పాటు ఈ ఉద్యమంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి రాజధాని పరిస్థితి ఏంటని ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న.