చొక్కాపట్టుకుని లాగేస్తా నా కొడకా అని ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు మరువక ముందే.. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే. ఏకంగా పోలీసులు బ్రోకర్లు అంటూ చిర్రులెత్తారు. వివరాలను పరిశీలిస్తే.. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన కొలుసు పార్థసారధి ఉయ్యూరు టౌన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ-వైసీపీ కార్యకర్తలకు దాడి చేసుకున్న ఘటనలో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిపై పోలీసులు చేయి చేసుకున్నారు.
దీనిపై స్టేషన్ కు వచ్చిన పార్థసారధి.. పీఎస్‍లో ఉన్న వ్యక్తుల్ని కొట్టే అధికారం మీకెక్కడిదని పోలీసులను ప్రశ్నించారు. ఇలా చేస్తే నేనూ రెచ్చగొడతానని, తర్వాత మీరేం చేయలేరని పోలీసులను హెచ్చరించారు. మేం అధికారంలో ఉన్నాం పోలీసులను కొట్టడం ఏమంత కష్టం కాదని బెదిరించారు. తమను పోలీసులు ఏం చేయలేరని పార్థసారథి వ్యాఖ్యానించారు. ఉయ్యూరు ఎస్‍ఐపై కోర్టులో కేసులు వేయాలంటూ వైసీపీ నేతలకు ఎమ్మెల్యే పార్థసారథి సూచించారు.
ఎస్ఐ, ఏఎస్ఐ లపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ సిటీ కమిషనరేట్ పరిధిలో ఉండకూడదని, అతనిపై చర్యలు తీసుకోకపోతే హోమ్ మినిస్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పోలీసులను తిడుతున్న తిట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులను ఏదైనా అంటే క్షణాల్లో వచ్చి తొడలుగొట్టే పోలీసుల అధికారుల సంఘం వారు ఇప్పుడు ఎక్కడ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రభుత్వంలో పోలీసులకు విలువ లేదు పాపం అంటూ మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పార్థసారధి వ్యాఖ్యలను ఇంతవరకూ ఖండించకపోవడం గమనార్హం.