మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆయన కుమారుడు రామ్‌చరణ్ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ముందుగా ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఏప్రిల్ 29కి వాయిదా వేశారు. తండ్రి కొడుకులు కలిసి నటిస్తోన్న సినిమా కావటంతో ఆచార్యపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఆచర్య సినిమాకు సంబంధించిన ప్రతీ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక రామ్‌చరణ్ కు చిరంజీవి సవాల్ విసిరారు. ‘ఆచార్య’ చిత్రంలో ‘భలే భలే బంజరా’ పాటలో డ్యాన్స్ స్టెప్‌లు ఎవరెలా వేస్తారో ఆ సెట్‌లో చూసుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. ఆ పాటకు సంబంధించి చిత్రీకరణకు వెళ్లే ముందు దర్శకుడు కొరటాలతో చిరంజీవి, రామ్‌చరణ్ చర్చించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చే ‘భలే భలే బంజారా’ పాటపై మంతనాలు సాగించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నాటునాటు పాటలో తారక్, చరణ్ ఇద్దరూ అదరగొట్టారని, ఆ అంచనాలను అందుకోవాలంటే కష్టపడక తప్పదని చిరంజీవి తెలిపారు. అయితే తనను చరణ్ డామినేట్ చేసే అవకాశం ఉందన్న చిరు… సెట్‌లో కెమెరా ముందు చూసుకుందామంటూ సవాల్ చేశారు. తండ్రి సవాల్ పై స్పందించిన చరణ్… డామినేట్ చేయనని, ఎక్కడా తగ్గని ప్రతిసవాల్ విసిరారు.
ఈ సినిమాలో ‘భలే భలే బంజారా’ అనే సాంగ్ ను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ పాట ప్రోమోను తాజాగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. చిరు- చరణ్ డ్యాన్స్ అద్భుతంగా చేసినట్టు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. మణిశర్మ స్వరాలందించారు. ఇక ఈ సినిమా ప్రీలిరీజ్ ఈవెంట్‌ను మెదట విజయవాడలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే షెడ్యూల్‌లో మార్పు జరిగిందని.. హైదరాబాద్‌లోనే ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారని సోషల్ మీడియాలో తాజాగా ప్రచారం జరుగుతుంది.