రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొద్ది రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా కురిపిస్తున్న బాంబుల వర్షానికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. కొంతమంది ప్రజలు యుద్ధానికి ఎదురుతిరిగి సైనికులుగా మారి పోరాడుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ యుద్ధంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరు వినిపిస్తోంది. ఇదేంటి.. ఎక్కడో ఉన్న ఉక్రెయిన్‌కి, చెర్రీకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా. నిజమే.. యుద్ధానికి, చరణ్‌కు సంబంధం లేదు. కానీ.. రష్యా సైనికుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటున్న ఉక్రెయిన్ పౌరుడికి, రామ్‌చరణ్‌కు సంబంధం ఉంది.
పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఉక్రెయిన్‌లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడ షూటింగ్ జరిగిన సమయంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు రస్టీ అనే ఉక్రెయిన్ పౌరుడు బాడీగార్డుగా వ్యవహరించాడు. ఇప్పుడు రష్యాతో జరుగుతున్న యుద్ధంలో పుట్టినగడ్డను కాపాడుకోవడానికి అతడు సైనికుడిగా మారాడు. అతడే కాదు, 80 ఏళ్ల అతడి తండ్రి కూడా గన్ పట్టుకుని యుద్ధంలో పోరాడుతున్నాడు. ఈ విషయం తెలిసి రామ్‌చరణ్ ఫోన్‌లో మాట్లాడారు. అతని గురించి, అతడి కుటుంబ బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏ సాయం కావాలన్నా చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో కష్టాలతో సతమతమవుతున్న రస్టీకి ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు చరణ్.
చరణ్ పంపిన డబ్బులతో అతడు నిత్యావసర వస్తువులు, మెడిసిన్ కొనుగోలు చేశాడట. చెర్రీ తనకు చేసిన సాయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు రస్తీ. కొంత కాలమే కలిసి పనిచేసినా.. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవడం చరణ్ గొప్ప మనసుకి నిదర్శనమని రస్తీ కృతజ్ఞతలు తెలిపాడు.