ఇంతటి ప్రజాదరణ ఏ పార్టీకి ఉంది.. ఏ నాయకుడికి ఉందని జనసేన స్టీరింగ్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. దామోదరం సంజీవయ్య పేద ఎస్సీ కుటుంబం నుంచి వచ్చారని, దామోదరం సంజీవయ్య గురించి ఏ పార్టీ నాయకుడూ మాట్లాడట్లేదన్నారు. పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కల్యాణ్ ఎన్నో అవమానాలకు గురయ్యారని, పవన్ తెలుగు ప్రజల కోసం ఎవరినైనా ఎదుర్కొంటానని అన్నారని తెలిపారు.
సంక్షేమం పేరుతో విలువలు లేని రాజకీయాలు చేస్తూ రూ.లక్షల కోట్లు సంపాదిస్తున్నారు.. భూకబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ను ఇబ్బంది పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు తవ్వేస్తూ నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. జనసేన సభా ఏర్పాట్లకు రైతులు సహకరించారని, రైతులు సొంతంగా ట్రాక్టర్లపై వచ్చి సభకు సహకరించారని సంతోషం వ్యక్తం చేశారు. అవమరావతిని నాశనం చేశారు.. 9 అంతస్తుల భవనం ఖాళీగా పడి ఉందని ఆవేదనం వ్యక్తం చేశారు. అమరావతిలో ఒకప్పుడు 8 కోట్లు పలికిన భూమి.. ఇప్పుడు 3 కోట్లకు పడిపోయిందన్నారు.
అమరావతి నాశనానికి జగన్ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి మహిళలు ఇప్పటం సభకు తరలివచ్చారని, 30-40 శాతం మందికే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఆక్షేపించారు. సంక్షేమం పేరుతో ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవాలని ఎందరో నాయకులు పార్టీ వదిలివెళ్లినా కార్యకర్తలు, మహిళలు పార్టీని నిలబెట్టారన్నారు. ఎమ్మెల్యేలే రౌడీలుగా మారి కర్రలు పట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. తమకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వెళ్లిపోయినా జనం కోసం మనం పోరాడుతామని చెప్పారు.