సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు సినీ పెద్దలు.. ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను, సింగర్లను లోబరచుకున్నారు. అవకాశాల పేరుతో తమను శారీరకంగా వాడుకున్నారంటూ ఇప్పటికే చాలా మంది నటీమణులు, సింగర్లు మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
మలయాళీ నటుడు విజయ్‌బాబు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ యువ నటి ఇటీవల పోలీసుల్ని ఆశ్రయించింది. కెరీర్ విషయంలో సాయం చేస్తానని విజయ్ మాటిచ్చాడని.. సినిమాల్లో అవకాశాలు ఆశ చూపి కొచ్చిలో ఓ ఫ్లాట్‌కి పిలిచాడని.. అక్కడ తనపై మార్చి 13 నుంచి ఏప్రిల్ 14 వరకూ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధితురాలు ఇటీవల ఎర్నాకులం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్‌బాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌బాబు స్పందించారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ వేదికగా తాను ఏ తప్పు చేయలేదని రాసుకొచ్చారు. ఈ ఘటనపై తనపై ఆరోపణలు చేసిన ఆ నటిని ఊరికే వదలనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరువునష్టం దావా వేస్తానని చెప్పారు.
ఇక విజయ్ బాబు మలయాళ చలనచిత్ర నిర్మాత, నటుడు మరియు వ్యాపారవేత్త. మలయాళ చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ ఫ్రైడే ఫిల్మ్ హౌస్ వ్యవస్థాపకుడు ఆయన. విజయ్ మలయాళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇండస్ట్రీకి చెందిన పెద్దలతో కూడా విజయ్ బాబుకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి.