26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ పాత్ర పోషించగా శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్, ప్రకాశ్‌రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. తెలుగు ప్రచార చిత్రాన్ని మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీదీ ట్రైలర్‌లో గూస్ బంప్స్ మూమెంట్‌గా వుంది. ట్రైలర్ లో 26/11 ఎటాక్ విజువల్స్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. అడివి శేష్ మేజర్ సందీప్ గా పరకాయ ప్రవేశం చేశారు. ప్రకాష్ రాజ్ వాయిస్, డైలాగ్స్, ఆయన నటన అద్భుతంగా వుంది. మెుత్తానికి ట్రైలర్ అంతా ఉద్విగ్నంగా సాగింది.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో చిత్రబృందంతో పాటు మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కి తెలుగు మీడియాతో పాటు బాలీవుడ్ మీడియా కూడా హాజరు అయింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు మహేష్ బాబు. ‘మేజర్’ సినిమా తీయడం ఎంతో గర్వంగా ఉందని.. ఈ సినిమా చూశానని అద్భుతంగా వచ్చిందని అన్నారు.అనంతరం కృష్ణ గారి బయోపిక్ ను ఎప్పుడు తీస్తారని..? ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘నాన్నగారి బయోపిక్ ఎవరైనా చేస్తే నేను ఆనందంగా చూస్తాను. నేనైతే చేయలేను. ఆయన నా దేవుడు. ఎవరైనా బయోపిక్ డైరెక్ట్ చేయడానికి ముందుకొస్తే ప్రొడ్యూస్ చేయడానికి నేను రెడీ’ అంటూ చెప్పుకొచ్చారు. అంటే కృష్ణ బయోపిక్ లో నటించే ఉద్దేశం మహేష్ బాబుకి లేదన్నమాట. మొత్తానికి తన తండ్రి బయోపిక్ పై క్లారిటీ ఇచ్చేశారు మహేష్ బాబు.