వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్షలు నిర్వహణా వైఫల్యంతో పూర్తిగా అభాసుపాలయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సీఎంకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. సీఎం అయి మూడేళ్లయినా కరోనా కారణంగా రెండేళ్లు పరీక్షలు జరగలేదని, ఎట్టకేలకు మీ పాలనా యంత్రాంగం నిర్వహించిన పరీక్షలు మన దేశంలోని పరీక్షల చరిత్రలోనే చీకటి అధ్యాయంగా నిలిచాయని ఆరోపించారు. రోజుకొక చోట పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, ఒకరి బదులు ఒకరు పరీక్షలు రాయించడం, లీకైన ప్రశ్నపత్రాలకి జవాబులు రాయించి జత చేయడం వంటివన్నీ జరిగాయన్నారు.
ప్రతిభకి కొలమానంగా నిలవాల్సిన పరీక్షలు అక్రమాల విక్రమార్కులకి వరం అయ్యాయని, చాలా చోట్ల పేపర్ లీకై, వైసీపీ వాట్సప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు ప్రత్యక్షం అవడం వైసీపీ నాయకుల పిల్లలకి మెరుగైన మార్కుల కోసం బరితెగించారని ఆరోపించారు. మరోవైపు పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం మీ ప్రభుత్వంపై నిరసన గళం వినిపించిన ఉపాధ్యాయులపై కక్ష పెట్టుకుని మరీ వేధించేందుకు టెన్త్ పరీక్షల్ని వాడుకుంటున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
మంత్రి బొత్స స్పందిస్తూ.. పేపర్ లీక్‍పై కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఇది విద్యార్థుల భవిష్యత్‍తో కూడుకున్న అంశమని పేర్కొన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, నిందితులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టామన్నారు. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని, లీక్ వ్యవహారంలో 38 మంది ప్రభుత్వ టీచర్లు, ఇద్దరు నాన్ టీచింగ్ ఆఫీస్ స్టాప్ ఉన్నారని వివరించారు. 22 మంది ప్రైవేట్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లు, ఏడుగురు విద్యార్థులు ఉన్నారని, ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు.