రాబోయే రోజుల్లో అందరం జనంలో ఉందామని, ప్రజలతో మమేకమవుదామని సీఎం జగన్ తన మంత్రులతో అన్నారు. సోమవారం మంత్రులతో భేటీ నిర్వహించారు. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోగా మంత్రులకు కొన్ని సూచనాలు, ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలని సూచించారు. ‘‘పథకాలను వివరిద్దాం. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం’‘ అన్న విధానాన్ని అందరూ పాటించాలని దిశానిర్దేశం చేశారు. జూన్ భారీ స్థాయిలో వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలన్నారు.
అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించాలని సూచించారు. గడప గడపకూ వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. ఉద్బోధించారు. ఈ భవిష్యత్ కార్యాచరణను ఎమ్మెల్యేలకు వివరించడానికి వైఎసార్ఎల్పీ సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, దానిపై ప్రజల నుంచి వచ్చిన వినతులు, సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ఆరంభమవుతుందని వివరించారు. అధికారంలోకి వచ్చిన 33 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. కరోనాతో వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ, సంక్షేమ, అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షం వేసే ఎత్తులకు పై ఎత్తులు వేయాలనే దానిపై సుధీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం.