మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అపోలో హాస్పటిల్స్ వైస్ ఛైర్ పర్సన్ గానే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా పర్యావరణ, జంతు ప్రేమికురాలిగా ఉపాసన చాలా మందికి పరిచయమే. కాగా తాజాగా ఉపాసన దుబాయ్ 2020 ఎక్స్‌పోను సందర్శించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీతో భేటీ అయిన విశేషాలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలానే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది.
ఈ మేరకు ఆ పోస్ట్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీని దుబాయ్ 2020 ఎక్స్‌పో వద్ద భేటీ అవ్వడం ఎంతో గౌరవ ప్రదంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నో రకాల కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్ష, మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతిక శక్తి మనకు ఎన్నో అవకాశాన్ని ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి. చంద్రుని మీద దక్షిణ ధృవంపై నీరు ఉందా… లేదా అని తెలుసుకునేందుకు ఇండియానే మొట్ట మొదటిసారిగా చంద్రయాన్ ప్రయోగం చేసిందని మీకు తెలుసా… ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు ఎక్స్‌పో కార్యక్రమంలో ఉన్నాయి.
మీ పిల్లలను ఈ ఎక్స్ పోకు తీసుకెళ్లాలని కోరుతూ ఉపాసన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. అయితే, ఎక్స్ పో విశేషాలతో పాటు ప్రధాని మోడీతో ఉపాసన కూర్చున్న ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా… నిజంగానే ఉపాసన మోడీతో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా కొందరు పొరబడుతున్నారు. అయితే ఇది అగ్‌మెంటెడ్ రియాలిటీ అనే టెక్నాలజీ ద్వారా ఈ ఫోటోను సృష్టించారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి చేసిందని తెలిసింది. దుబాయ్ 2020 ఎక్స్‌పోలో భారత పార్లమెంట్, ప్రధాని మోదీ ఉన్నట్లు ఆవిష్కరించి ఇలా షేర్ చేశారు.