ప్రతిపక్షాలపై రాష్ట్ర పౌరసరఫరాశాఖ మంత్రి కొడాలి నాని మరోసారి మాటలతో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత రెండున్నర్రేళ్ల పాలనలో దక్కిన ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాగైనా ఆటంకాలు సృష్టించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు పెట్టుకున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఓటీఎస్ పథకాన్ని తీసుకొచ్చామని.. ఇప్పుడు ఆ పథకంపై కూడా దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాని. పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో..యజమాని హక్కులు కల్పించాలనే లక్ష్యంతోనే ఓటీఎస్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
మరోవైపు ఎల్లో మీడియాను ఉద్దేశిస్తూ మాట్లాడిన కొడాలి.. పచ్చమీడియా అసత్య ప్రచారంతో జనాల్లో భయాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. రాష్ట్రంలో ఏదో ఘోరం జరుగుతోందనే అభూత కల్పన సృష్టిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఉన్నది ఉన్నట్లు చెప్పాల్సిన బాధ్యత స్థానిక సంస్థల ప్రతినిధులపై ఉందని.. ఇటువంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించి.. వారి భయాన్ని పోగొట్టాలని సూచించారు. కాగా, ఇచ్చిన మాట ప్రకారం.. జనవరి నుంచి పింఛన్ రూ. 2,500కు పెంచనున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేసి మళ్లీ ఇలాగే అధికారంలోకి వచ్చి.. వారికి అండగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమని మంత్రి వివరించారు.