Site icon 123Nellore

దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం.. ఎందుకంటే..!

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం మలయాళం ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా బహుభాషా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక దుల్కర్‌కు సొంత రాష్ట్రంలోనే తన సినిమాలపై నిషేదం పడింది.

దుల్కర్‌ తాజాగా నటించిన ‘సెల్యూట్‌’ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే . ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌తో ఈ చిత్రంపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అయితే ఈ సినిమాను ఈనెల 18న సోనీ LIVలో నేరుగా విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. ఇందులో దుల్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సెల్యూట్‌’కు రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వం వహించారు. అయితే ‘సెల్యూట్‌’ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తుండటంతో.. కేరళ థియేటర్స్‌ అసోసియేషన్‌ దుల్కర్‌పై బ్యాన్‌ విధించింది. ఇకపై ఆయన నటించిన సినిమాలను రాష్ట్రంలోని థియేటర్లలో విడుదల చేయకూడదని నిర్ణయించుకుంది.

కాగా, సంక్రాంతి కానుకగా జనవరి 14 న ‘సెల్యూట్’ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తొలుత ప్రకటించింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్‌ అందరితో నిర్మాణ సంస్థ చర్చలు జరిపింది. అదే సమయంలో కొవిడ్‌ మూడో వేవ్‌ రావడంతో సినిమా విడుదల వాయిదా వేశారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తామని టీమ్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ‘సెల్యూట్‌’ని తొలుత అనుకున్నట్లు థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌ ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు టీమ్‌ ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల కేరళ థియేటర్‌ అసోసియేషన్‌ అసహనం చెందింది. ‘సెల్యూట్‌’ థియేటర్‌ రిలీజ్‌కు సంబంధించి తమతో నిర్మాణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పుడు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్‌ ఓటీటీకి వెళ్లడం ఏం బాగోలేదని అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Exit mobile version