నూతన ఫ్రంట్ ఏర్పాటుకై తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులతో నిత్యం తెలంగాణ సీఎం కేసీఆర్ టచ్ లో ఉంటున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నాటికి కూటమి రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నూతన కూటమి తరపున అభ్యర్థిని నిలపాలనే యోచనలో కేసీఆర్ బలంగా ఆలోచనలు చేస్తున్నారు.
అయితే కేసీఆర్ వ్యూహకర్తగా ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌తో భేటీ అనంతరం జనతాదళ్ యునైటెడ్ నేత, బిహార్ సీఎంతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. ప్రశాంత్ కిశోర్, నితీష్ కుమార్ మధ్య సుమారు 2 గంటలపాటు సమావేశం జరిగింది. గతంలో ప్రశాంత్ కిశోర్ ను పార్టీ నుంచి జనతాదళ్ యునైటెడ్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. థర్డ్ ప్రంట్ ఏర్పాటుపై ఇద్దరు నేతలు చర్చించి ఉంటారని రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా జనతాదళ్ యునైటెడ్ ఉంది. బీజేపీ ముక్త్ భారత్ అంటూ కాంగ్రెస్ భాగస్వామ్య పక్ష నేతలతోనే సీఎం కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. ఫ్రంట్ ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్, ఒడిశా ముఖ్యమంత్రుల నవీన్ పట్నాయక్ తో ఇప్పటి వరకు కేసీఆర్ మాట్లాడలేదు. మార్చి మొదటివారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. మమతా బెనర్జీ, కేసీఆర్ నూతన ఫ్రంట్ ఏర్పాట్లపై సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ తో కలిసే విపక్షకూటమి సాధ్యమని సీపీఎం సహా పలు ఇతర పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. బీజేపీ బలంగా ఉన్న నేపథ్యంలో ఫ్రంట్ ఫలించకపోవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.