సీఎం కేసీఆర్ పది రోజుల క్రితం ఫోన్ చేశారని, కేసీఆర్ ఆహ్వానం మేరకే వెళ్లి కలిశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పదేళ్ల కిందట ఆయనతో మాట్లాడాను. పార్టీ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. మా మధ్య బీఆర్‍ఎస్ గురించి చర్చ జరగలేదు. బీజేపీ విషయంలో మా ఇద్దరి ఆలోచనలు ఒక్కటే. జగన్, చంద్రబాబు, పవన్ ఎవరికి మద్దతిస్తారో తెలీదా?. బీజేపీకి నేను వ్యతిరేకం కాదు.. విధానాలకు వ్యతిరేకం. బీజేపీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్షాలు బలంగా ఉండాలి.
బీజేపీ లోపాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లేవారు లేరు. దేశంలో ప్రతిపక్షం ఉండొద్దన్నది బీజేపీ విధానం. వ్యతిరేకించినవారిపై ఈడీ, సీబీఐ, ఐటీతో దాడులు చేయిస్తున్నారు. దేశంపై కేసీఆర్‍కు సరైన అవగాహన ఉంది. కేసీఆర్‍తో దాదాపు మూడు గంటల పాటు చర్చ జరిగింది. నాతో పాటు భేటీలో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు. కేసీఆర్ చెప్పిన విషయాలు విని నేను ఆశ్చర్యపోయాను. సీఎం కేసీఆర్‍కు ఫుల్ క్లారిటీ ఉంది. పక్కా ఎజెండాతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.
ఎప్పుడు పిలిచినా వస్తానని కేసీఆర్‍కు చెప్పా. నేను రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యా. బీజేపీయేతర పార్టీలను కేసీఆర్ లీడ్ చేయగలరు. దేశరాజకీయాలపై కేసీఆర్ నాకంటే ఎక్కువ స్టడీ చేశారు. కేసీఆర్ మంచి కమ్యూనికేటర్. మమతా బెనర్జీ కన్నా కేసీఆర్ బాగా కమ్యూనికేట్ చేయగలరు. బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరం. దేశంలో కాంగ్రెస్ బలహీనపడిందని అనిపిస్తోంది. దేశంలో ప్రత్యామ్నాయం అవసరం. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన నోటీసులతో దేశం గుడ్‍విల్‍కు దెబ్బ’’ అని ఉండవెల్లి అరుణ్‍కుమార్ అన్నారు.