సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు యూనివర్సల్ హీరో కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘విక్రమ్’. కమల్‌తోపాటు విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య లాంటి స్టార్ కథానాయకులు.. విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లో రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయంపై తాజాగా కమల్ హాసన్ స్పందించారు. చెన్నైలో రక్తదాన ప్రచార కార్యక్రమంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే డబ్బు విషయంలో ఎలాంటి చింతలేని నాయకుడు మనకు కావాలి. గతంలో నేను రూ.300 కోట్లు సంపాదిస్తానంటే ఎవరూ నా మాట నమ్మలేదు. అసలు వాళ్లు నా మాటల్ని అర్థం చేసుకోలేదు కూడా. ‘విక్రమ్’ వసూళ్లతో ఇప్పుడు నా మాట నిజమైంది. ఇక, ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా. నాకిష్టమైన ఆహారాన్ని తింటా. కుటుంబం, సన్నిహితులకు ఆర్థికంగా చేతనైనంత సాయం చేస్తా. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయాక.. ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పేస్తా. వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పక్కన వాళ్లకి సాయం చేయాలనే ఉద్దేశం లేదు. నేను ఒక మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా’’ అని కమల్ హాసన్ తెలిపారు.
‘విక్రమ్’ భారీ విజయం తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజ్, సహాయ దర్శకులు పదమూడు మందితో పాటు అతిథి పాత్రలో నటించిన సూర్యకు ఖరీదైన బహుమతులు ఇచ్చిన కమల్ హాసన్… ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తో సమావేశం అయ్యారు.