Site icon 123Nellore

రామ్‌ లేకుండా భీమ్‌ లేడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ నోట్..!

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన పాన్‌ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ సాధించి దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు అన్ని రికార్డులనూ తిరగరాసింది. అంతటి ఘన విజయాన్నందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్టీఆర్ నోట్ విడుదల చేశారు. ‘మాటలు చాలవు’ అని పేర్కొంటూ ట్విట్టర్ లో ఆయన థ్యాంక్స్ నోట్ ఇచ్చారు.

“నా బెస్ట్ ఇచ్చేలా నన్ను ఇన్‌స్ఫైర్‌ చేసిన జక్కన్న (రాజమౌళి)కు థాంక్స్. నాలోని నటుడిని బయటకు తీసుకొచ్చారు. పాత్రకు తగ్గట్టుగా నన్ను నీరులా మార్చావు. నా బ్రదర్ రామ్ చరణ్ లేకుండా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఊహించుకోలేను. అల్లూరి సీతారామరాజు పాత్రకు చరణ్ తప్ప ఎవరూ న్యాయం చేయలేరు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాయే కాదు, భీమ్ పాత్ర కూడా చరణ్ లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది. లెజెండరీ హీరో అజయ్ దేవగణ్ గారితో నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆలియా భట్ పవర్ హౌస్. తన పాత్రతో సినిమాకు బలం చేకూర్చింది. ఒలీవియా, అలీసన్ డూడీ,రే స్టీవెన్ సన్ తమ నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇండియన్ సినిమాకు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాను” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

“‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ కల సాకారమయ్యేలా చేసిన నిర్మాత డీవీవీ దానయ్యకు కృతజ్ఞతలు. మీరే మాకు నిజమైన వెన్ను.  ఆర్ఆర్ఆర్ సినిమాకు సంగీతంతో ప్రాణం పోసిన కీరవాణికి ధన్యవాదాలు. మనసును మెలిపెట్టే మీ సంగీతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరిన్ని సంవత్సరాల పాటు మీరిలాగే ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. మీ సంగీతం సాంస్కృతిక, భాష, భౌగోళిక హద్దులను దాటి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మనసులను గెలిచింది.  భారతీయ సినీ చరిత్రలోనే ఓ అద్భుతమైన కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. కొన్ని కోట్ల సినీ ప్రేక్షకుల గుండెల్లో మీ కథ ఎప్పటికీ నిలిచిపోతుంది. రాబోయే తరాలూ మీ కథల గురించి చెప్పుకుంటాయి.”

ఇలా సినిమాలో భాగమైన ప్రతిఒక్కరినీ ప్రస్తావిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్‌. చివరగా అభిమానులకు కూడా ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు. మరిన్ని సినిమాలతో వాళ్ళను ఎంటర్టైన్ చేస్తానని చెప్పారు. అభిమానులు చూపించే ఎటువంటి పరిమితులు లేని ప్రేమ, మద్దతు కరోనా సమయంలోనూ తాను బెస్ట్ ఇచ్చేలా దోహదం చేసిందని ఎన్టీఆర్ తెలిపారు.

Exit mobile version