Site icon 123Nellore

అరెస్ట్‌ వారెంట్‌పై జీవితా రాజశేఖర్‌ రియాక్షన్‌ ఇదే..!

జీవితా రాజశేఖర్ దంపతులను నమ్మి తాము రూ. 26 కోట్లు మోసపోయామని, వారితో ఎవరూ సినిమాలు తీయడానికి ముందుకు రాని సమయంలో రూ. 26 కోట్లు ఖర్చు పెట్టి ‘గరుడవేగ’ తీశామని, తమ దగ్గర ఆస్తులు తాకట్టు పెట్టి వాటిని వేరే వాళ్లకు అమ్మారని జీస్టర్ గ్రూప్ ఫౌండర్ కోటేశ్వర్ రాజు, ఛైర్మన్ హేమ ఆరోపించిన సంగతి తెలిసిందే. శనివారం హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేసిన ‘శేఖర్’ సినిమా విలేఖరుల సమావేశంలో ఆ ఆరోపణలపై జీవితా రాజశేఖర్ స్పందించారు.

సుమారు రెండు నెలల నుంచి ఈ కేసు కోర్టులో ఉందని, ఇప్పుడు వాళ్లు ప్రెస్‌మీట్‌ పెట్టి ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదని అన్నారు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవాలు లేవని.. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ‘‘ఈ కేసుకు సంబంధించి 2 నెలల క్రితమే వారెంట్‌ వచ్చింది. నాకెలాంటి సమన్లు అందలేదు. మా గౌరవానికి భంగం కలిగించడం ఎవరి తరం కాదు. నేను తప్పు చేస్తే ఒప్పుకుంటా, నా తప్పు లేకపోతే దేవుడ్ని కూడా ధైర్యంగా నిలదీస్తా. మా గురించి ఆరోపణలు చేసిన వాళ్లేమీ మహాత్ములు కాదు. వాళ్ల వల్ల మా మేనేజర్‌, ఇంకా ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది.. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడలేను. ఈ విషయంలో నేను దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా” అని జీవితా రాజశేఖర్ చెప్పారు.

” ఇటీవల మా అమ్మాయిల గురించి తప్పుడు వార్తలు రాశారు, ఇష్టమొచ్చినట్టు థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు పెట్టారు. చాలామంది నాకు ఫోన్లు చేసి మీ అమ్మాయిలు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్లకి యాక్టింగ్ అంటే ఇష్టం. వాళ్లపై ఇలాంటి వార్తలు రాయడం కరెక్ట్ కాదు. విషయం తెలియకుండా ఇలాంటి వార్తలు రాయడం వల్ల వాళ్ల కెరియర్ ఏమౌతుందో ఆలోచించండి. మొన్న నా కూతుళ్ల గురించి, ఇటీవల నిహారికపై కూడా ఇలాగే యూట్యూబ్‌లో పెట్టారు. దయచేసి ఇలా ఇష్టం వచ్చినట్లు థంబ్‌నేల్స్‌ పెట్టి మాకు ఇబ్బంది కలిగించకండి’’ అని జీవిత పేర్కొన్నారు.

Exit mobile version