జగన్ ఇకనైనా తన పద్ధతి మార్చుకోవాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. చిత్రపరిశ్రమపై జగన్ కక్షగట్టారని విమర్శించారు. తన కార్యాలయంలో గురువారం ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌కు చిరంజీవి దండం పెట్టడం చూస్తే తనకు బాధ కలిగించిందన్నారు. జగన్ కు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిపైనా పగసాధిస్తున్నారని పేర్కొన్నారు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి పరిశ్రమ బాగు కోసం దండం పెట్టాడని గుర్తు చేశారు.
ఇగో జగన్ ఒక్కడికే కాదని, ప్రతి ఒక్కరికీ ఉంటుందని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే ప్రజలకు మేలు చేసి మన్ననలు పొందాలన్నారు. ఏపీలో ఎవరూ ఉండకూడదన్న ఉద్దేశంతో జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపైనా కేసు పెట్టిస్తున్నారని తెలిపారు ఏపీకి వచ్చి డైరెక్టర్లు సినిమా తీసే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. పవన్‌కల్యాణ్‌ను జగన్ ఏమీ చేయలన్నారు. కక్ష సాధింపులతో సినిమా థియేటర్ ముందు పల్లీలు అమ్ముకునే వారి నుంచి లైట్ బాయ్ వరకూ నాశనమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదవాడికి సినిమా రూపంలో అందే వినోదాన్ని కూడా ఈప్రభుత్వం అందనివ్వడం లేదన్నారు. తెలుగు సినిమా స్థాయి పెరిగిందనీ, హిందీ చిత్ర పరిశ్రమ ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తుందని ఆయన అన్నారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి దిశగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుంటే జగన్ తన ఈగోతో సినీ పరిశ్రమను టార్గెట్ చేసి చిత్ర పరిశ్రమను ఇబ్బందులకు గురి చేస్తునారిని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు.