ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో తేదెపా నేతలు ఓటీఎస్‌ను రద్దు చేయాలని కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్బంగా చింతమనేని మాట్లాడుతూ.. సీఎం జగన్ అన్ని వర్గాల వారిని దోపిడీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం ఓటీఎస్ సెటిల్మెంట్ కాదని.. ఓజేడీ(ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి దోపిడీ) అంటూ ఎద్దేవా చేశారు. పేవారికి పక్కా హక్కులతో ఇళ్లు కేటాయిస్తామని ఈ పద్దతిని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, పరిస్థితి చూస్తుంటే.. త్వరగా ఇళ్లు అమ్మేసి తాగి నెత్తిన పోసికోండని అన్నట్లు జగన్ పాలన ఉందని విమర్శించారు.
టీడీపీ అధికారంలోకి వస్తే లబ్దిదారులకు నయాపైసా ఖర్చు లేకుండా హక్కులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అధికారులకు, వాలంటీర్లకు ఎవ్వరూ తలదించుకుని బతకాల్సిన అవసరం లేదని అన్నారు చింతమనేని.