తానేప్పుడూ ఎటువంటి పదవులు ఆశించలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్‌కు తాను సమస్య కాకూడదని, ఆయన ఏ పని అప్పగించినా చేయటానికి తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జనాల్లోకి వెళ్లి పార్టీ కోసం పని చేయమన్నా వెళతానని తెలిపారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి అందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తారని అభిప్రాయపడ్డారు. అనేక సమీకరణాల నేపథ్యంలో సీఎం జగన్ నిర్ణయాలు ఉంటాయన్నారు. స్పీకర్‌గా ఉండాలని తనకు చెప్పడానికి కూడా అప్పుడు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు.
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సర్… అని చెప్పి బాధ్యత తీసుకున్నానని చెప్పారు. మంత్రి వర్గ కూర్పు చాలా బాగుందన్నారు. అన్ని వర్గాల దామాషా పద్ధతితో మంత్రి పదవులు కేటాయించారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అందరికీ సమామమైన న్యాయం చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. 133కార్పొరేషన్లలో బీసి, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. బినెట్‍లో అందరికీ సమాన న్యాయం జరిగిందని, అణగారిన వర్గాలకు గొప్ప అవకాశం కల్పించారన్నారు. బీసీలకు పెద్దఎత్తున రాజ్యాధికారం జగన్ ఇచ్చారన్నారు.
కేబినెట్‍లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు. వెనుకబడిన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారన్నారు. సీఎం వైఎస్ జగన్ పెద్ద మానవతావాదని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే చేరుస్తున్నారని, టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారని తెలిపారు. ఇక స్పీకర్ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. స్పీకర్ పదవికి రాజీనామా చేసి సీఎం వద్ద చిడతల బ్యాచ్ లో చేరాలని ఎద్దేవా చేశారు.