డ్వాక్రా సంఘాలతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో మహిళలకు ఉచితంగా ఇళ్లిస్తే.. జగన్ రెడ్డి మాత్రం ఓటీఎస్‍తో ఎదురు డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఎన్టీఆర్ ఇచ్చిన ఇళ్లకు కూడా ఓటీఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలు ఓటీఎస్ వసూళ్లు కట్టొద్దని పిలుపునిచ్చారు. పోరాటానికి అమరావతి రైతులే ఆదర్శమన్నారు. జగన్ రెడ్డి ఇచ్చేది గోరంత.. దోచేది కొండంతని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో ఆదాయాలు తక్కువ, ఖర్చులు ఎక్కువని, చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. మద్య నిషేధమన్నారు.. మద్యంలో కొత్త బ్రాండ్లు తెచ్చారన్నారు. ‘‘మద్యం ఆదాయాన్ని 25 ఏళ్లు తాకట్టు పెట్టడం ద్వారా 25 ఏళ్ల పాటు మద్య నిషేధం ఉండదని చెప్పేశారు.
టీడీపీ ఐటీ ఉద్యోగాలిస్తే.. వైసీపీ చికెన్, మటన్ షాపుల్లో ఉద్యోగాలిస్తున్నారు. సీఎం జగన్‍రెడ్డి అబద్ధాలపై పుస్తకం వేస్తున్నాం. నెత్తి మీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపో ఎల్లుండో సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. రోజు రోజుకూ పతనావస్థకు వెళ్తున్నారు. మరిన్ని రోజులు గడిస్తే వ్యతిరేకత పెరుగుతుందని సీఎం భయపడుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయం. సీఎం జగన్ పక్కా బిజినెస్ మ్యాన్. ప్రతి రోజు ఎంత సంపాదించామోనని గల్లా పెట్టే చూసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ.. ఇప్పుడు కానీ.. భువనేశ్వరి ఎప్పుడైనా రాజకీయాల్లో కన్పించారా’’ అని ప్రశ్నించారు.